సొలొమోనుతో కూడ కలసి గిబియోనునందుండు బలిపీఠము నొద్దకు పోయిరి; దావీదు దేవుని మందసమును కిర్యత్యారీమునుండి తెప్పించి యెరూషలేమునందు దానికొరకు గుడారమువేసి తాను సిద్ధపరచిన స్థలమున నుంచెను.
అందుకు దేవుడు సొలొమోనుతో ఈలాగు సెలవిచ్చెనునీవు ఈ ప్రకారము యోచించు కొని, ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువునైనను అడుగక, నేను నిన్ను వారిమీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి యున్నావు.
కాబట్టి జ్ఞానమును తెలివియు నీ కియ్య బడును, నీకన్న ముందుగానున్న రాజులకైనను నీ తరువాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చెదను అని చెప్పెను.
వారు ఐగుప్తునుండి కొని తెచ్చిన రథమొకటింటికి ఆరువందల తులముల వెండియు గుఱ్ఱమొకటింటికి నూటఏబది తులముల వెండియు నిచ్చిరి; హిత్తీయుల రాజులందరికొరకును సిరియా రాజులకొరకును వారు ఆ ధరకే వాటిని తీసికొనిరి.